Sunday, August 31, 2014

ప్రముఖ దర్శకుడు బాపు కన్నుమూశారు


ప్రముఖ దర్శకుడు బాపు కన్నుమూశారు. ఆయన ఆదివారంనాడు చెన్నైలోని మలర్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆదివారం ఉదయం ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. బాపు మార్క్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మినారాయణ. ఆయన 1933 డిసెంబర్ 15వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా కంతేరులో జన్మించారు. బాపు తల్లిదండ్రులు సూర్యకాంతమ్మ, వేణుగోపాల రావు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి పాపు లా పట్టా పుచ్చుకున్నారు. ముళ్లపూడి రమణ, బాపు కాంబినేషన్ చలనచిత్ర రంగంలో పేరెన్నిక గన్నది. రమణ రాత, బాపు గీత అనేది సాహిత్య ప్రపంచంలో కూడా చిరకాలం నిలిచిపోయింది. కార్టూనిస్టుగా ఆంధ్రపత్రికలో 1945లో తన వృత్తిజీవితాన్ని ప్రారంభించిన బాపు 1967లో సాక్షి సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన మొత్తం 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. బాపు వేసిన చిత్రాలు అత్యంత ప్రసిద్ధి. ఆయన చివరి సినిమా బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం 2011లో వచ్చింది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా చిత్రాలు నిర్మించారు. ముత్యాలముగ్గు సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు పొందింది. ఆందాలరాముడు, రాధాకళ్యాణం, మిస్టర్ పెళ్లాం, రాధాగోపాలం, సుందరకాండ వంటి పలు ప్రసిద్ధి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయనకు 1986లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. బాపు రెండు సార్లు జాతీయ అవార్డులు, రెండు సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఐదు సార్లు నంది అవార్డులు అందుకున్నారు. బాపును 2013లో పద్మశ్రీ అవార్డు వరించింది. 1991లో ఆయనను ఆంధ్రవిశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. కథానాయికలను ఆయన చూపించే పద్ధతి విశేష జనాదరణ పొందడమే కాకుండా ప్రసంశలు అందుకుంది. తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి. బాపు మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం పర్కటించారు.

0 comments:

Post a Comment